11, మార్చి 2014, మంగళవారం

సుష్మా పాత్రను ఎన్నటికి మరువలేనిది :  రాజ్‌నాథ్

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొందడంలో తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ పాత్ర మరువలేనిదని, దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభలలో ఆయన ప్రసంగించారు. రెండు రాష్ట్రాలను కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని,

సీమాంధ్రకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణతో పాటు సీమాంధ్రలను ఎలా అభివృద్ధి చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సలైట్ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. దేశంలో సుపరిపాలన అందించే ఏకైక పార్టీ బిజెపి అని, ఈ విషయం తాను మాత్రమే చెప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అదే విషయం చెబుతున్నారని ఆయన అన్నారు.

తాము అధికారంలోకి రావడానికి తమ పార్టీ రాజకీయం చేయదని, దేశాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తుందని ఆయన చెప్పారు. తాము మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ విధమైన సమస్య రాలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంపై తమ పార్టీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. గుజరాత్ అభివృద్ధిని సోనియా గాంధీ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా ప్రశంసించిందని ఆయన అన్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సమస్య, విద్యుత్తు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి సహకరించాలని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలంగాణ ప్రజలను కోరారు. ఇరు ప్రాంతాల అబివృద్ధి బాధ్యత కేంద్రంపై ఉంటుందని, బిజెపి అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను బిజెపి నెరవేర్చిందని ఆయన చెప్పారు. అబివృద్ధికి మారు పేరు తమ పార్టీ అని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును భూస్థాపితం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణను బిజెపి మాత్రమే అభివృద్ధి చేయగలుతుందని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

బిజెపిలోకి జీవిత
 హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షులు తమకు అనుకూలమైన గూటికి చేరిపోతున్నాయి. ఎన్నికల ముందు వలసలు సహజమే అయినప్పటికీ ఈసారి రాష్ట్ర విభజనతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్స్ మరింత జోరందుకున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలు శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకట స్వామితోపాటు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి తమ అనుచరులతో సహా తరలి వచ్చి తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వీరంతా ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య ఈనెల 12వ తేదీ తర్వాత తిరిగి సొంతగూడు అయిన టిడిపిలో చేరనున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లునెగ్గిన రత్తయ్య ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక బయటికి వచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సీమాంధ్రకు చంద్రబాబు నాయకత్వం అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయంతో... టిడిపిలో చేరనున్నట్లు చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి