1, మార్చి 2014, శనివారం

 ఖమ్మం నుంచి షర్మిల పోటీ... ఊ హా గానాలు 




హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో కూడా తన ఉనికిని చాటుకునేందుకు వ్యూహరచన చేసినట్లే కనిపిస్తోంది. తెలంగాణ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తూ ఆమెను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోకసభ స్థానం నుంచి పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నం నుంచి గానీ మల్కాజిగిరి నుంచి గానీ ఆమె పోటీ చేస్తారని భావిస్తూ వచ్చారు. అయితే, మారిన వ్యూహం ప్రకారం తెలంగాణలో సత్తా చాటాలంటే ఖమ్మం సరైన స్థానమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత షర్మిలపై వ్యక్తం కాదని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తల్లి విజయలక్ష్మితో కలిసి షర్మిల తెలంగాణలో యాత్ర చేపడతారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణవాదం బలంగా లేకపోవడంతో పాటు కోస్తాంధ్రకు చెందినవారు ఎక్కువగా ఉండడం వల్ల ఖమ్మం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలుంటాయని అంటున్నారు. ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా తెలంగాణ అంతటినీ ప్రభావితం చేయడానికి కూడా వీలవుతుందని అంటున్నారు. జగన్ వ్యూహరచన ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా, సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించిన సిపిఎం సహకారం కూడా ఉంటుందని భావిస్తున్నారు. సిపిఎంతో పొత్తు పెట్టుకుంటే ఖమ్మంలో షర్మిల విజయం మరింత సులభమవుతుందని అంటున్నారు. సిపిఎంకు తెలంగాణలో ఉన్న క్యాడర్ కూడా తమ పార్టీకి ఉపయోగపడుతుందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నాలను నిలువరించడానికి కూడా సిపిఎం ఉపయోగపడుతుందని అంటున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఇక్కడ పోటీకి దిగాలని పార్టీ పెద్దల నిర్ణయించారు. ఖమ్మంపై పట్టు సాధించడం షర్మిలకు వ్యక్తిగతంగా కూడా అవసరమని భావిస్తున్నారు. దానివల్ల అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆమె వెనకాడకపోవచ్చునని అంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి