2, మార్చి 2014, ఆదివారం


కూతురు ముందే రొమాన్స్...

 చెన్నై : రజనీకాంత్‌... 'కోచ్చడయాన్‌' (విక్రమ్ సింహా) సినిమా సెట్‌లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డారని చెన్నై సినీ వర్గాల సమాచారం. హీరోయిన్ దీపికా పదుకొణేతో రొమాన్స్‌ పండించేటప్పుడు తెలియని అసౌకర్యానికి గురయ్యారట. కారణమేమిటంటే... అక్కడ యాక్షన్‌, కట్‌ అని చెబుతున్నది ఎవరో కాదు, అతని కూతురు సౌందర్య. కూతురు ముందు హీరోయిన్ తో కలిసి ఆడిపాడటం రజనీకాంత్‌కి అంతగా నచ్చలేదట. ఈ విషయాన్ని సౌందర్యనే చెప్పింది. సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగులో 'విక్రమసింహా' పేరుతో విడుదల కాబోతోంది. ''నాన్నతో సినిమా తీస్తూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. దేవుడి దయ ఉంటే నాన్నతో మరో సినిమా తీస్తా'' అని చెప్పింది.

ఈ చిత్రంలో శరత్‌కుమార్, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, శోభన, నాజర్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్' తరహాలో మోషన్ కాప్చర్ 3డి టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. కె.ఎస్. రవికుమార్ రచన చేయగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాని హిందీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లోనూ అనువదిస్తున్నారు. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి