2, మార్చి 2014, ఆదివారం

సామాన్యుడిపై మళ్ళీ పెరిగిన పెట్రో భారం 

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 60పైసలు, డీజిల్‌పై 50పైసల చొప్పున పెంచుతూ (పన్నులు కలుపుకోకుండా) చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. గడచిన జనవరి 4వ తేదిన పెట్రోల్ ధరలను లీటరుకు 91 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసినదే. తాజా పెంపుతో ఢిల్లీ లీటర్ పెట్రోల్ ధర రూ.72.43 నుంచి రూ.73.16కు పెరగగా, ముంబైలో 81.31 నుంచి రూ.82.07కు పెరిగింది. అమెరికన్ డాలరుతో పోల్చుకుంటే, రూపాయి మారకపు విలువ క్షీణించడం వలన అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి ఫలితంగా దిగుమతి ధర కూడా పెరగటంతో ధరలు పెంచక తప్పడం లేదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పేర్కొంది.

కాగా.. డీజిల్ ధర పెంపును మాత్రం జనవరి 2013లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి (ప్రతినెలా లీటరుకు 50 పైసల చొప్పున, సబ్సిడీ భారం తమపై నుంచి పూర్తిగా తొలగిపోయే వరకు పెంచడం) ఈసారి కూడా 5లీటరుపై 50 పైసల చొప్పున పెంచారు. జనవరి 2013 నుంచి ఇప్పటి వరకు వరుసగా 14 సార్లు డీజిల్ ధరను పెంచినప్పటికీ చమురు కంపెనీలు ఇంకా లీటరు డీజిల్ విక్రయంపై రూ.8.37 చొప్పన నష్టపోతున్నట్లు ఐఓసి ప్రకటించింది. జనవరి 2013 నుంచి ఇప్పటి వరకు డీజిల్ ధర మొత్తంగా లీటరుకు 8.33 మేర పెరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి